వరంగల్-ఖుష్ మహల్, ముస్లిం పాలకుల చేత నిర్మించబడ్డ నిర్మాణం ఖుష్ మహల్. ఉత్తరాభిముఖంగా వున్న ఖుష్ మహల్ నాలుగడుగుల ఎత్తైన పునాదుల మీద వుంది. దీర్ఘచతురస్రాకారంలో వున్న ఈ భవనం కొలతలు 140*53 అడుగుల పొడవు,వెడల్పులు. బయటి ద్వారపు ఆర్చ్ దాదాపు 40 అడుగుల ఎత్తున్నది. మొత్తం భవనం ఎత్తు 50 అడుగులు. పార్శ్వంలో మనకు కనిపించే ఆర్చులు 7. మొత్తం 14 ఆర్చులు కనిపిస్తాయి. ఇదొక దర్బారు హాల్ వంటిది.
ఈ భవనం ముందర పురాతన శిల్పాలు, కొన్ని శాసనాలు వున్నాయి. తూర్పువైపున నీటినిలువ చేసిన జాడలు కనిపిస్తాయి. భవనం గోడలు చక్కగా చెక్కిన రాతిబండలతో కట్టారు. ఈ నిర్మాణం కాకతీయ భవనం శిథిలాలమీద కట్టినట్టుంది. వరంగల్ స్వాధీనమైనాక తుగ్లక్ ఇక్కడున్న కాకతీయ నిర్మాణాన్ని తొలగించి ఖుష్ మహల్ కట్టివుండాలి. 15వ శతాబ్దంలో ఈ భవనాన్ని కొంత బాగుచేయించింది కుతుబ్షాహి రాజుల చేత నియమించబడిన షితాబుఖాన్ ఉరఫ్ సీతాపతిరాజు.

తన కార్యకలాపాలకు ఖుష్ మహల్ ను పాలనాభవనంగా వాడుకున్నాడు.
ఇపుడీ ఖుష్ మహల్ చిన్న మ్యూజియం. ఇందులో కొన్ని శిల్పాలు యాత్రికుల కొరకు మహల్ లో నిలిపారు. వీటిలో ఆసనస్థితిలో వున్న శిల్పం వైష్ణవ భక్తునిది. ఇటువంటిదే శాయంపేట దేవాలయ ప్రాంగణంలో వుంది. ఈ విగ్రహం భుజాలపై శంఖు,చక్రాల ముద్రలున్నాయి. ముద్రధారణం వైష్ణవసంప్రదాయం. కేశవమూర్తి శిల్పం, 3 త్రినేత్ర శివశిల్పాలు,గణపతి, కార్తికేయ శిల్పాలు, చాముండి, లింగం, నంది విగ్రహాలు, జినుడు, పార్శ్వనాథుల శిల్పాలు, ఒక శిఖర కలశ శిలలున్నాయి. ఖుష్ మహల్ బయటవున్న విగ్రహాలు, శాసనాలలో ఒక విరిగిన విగ్రహం జైనశిల్పం. అది బాహుబలిది. ఈ ఖుష్ మహల్ తుగ్లకాబాద్ లోని దీవాన్-ఇ-ఆమ్ వలె వుంది.