వరంగల్: గ్రంథాలయాల నవీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతితో కలసి స్మార్ట్ సిటీ క్రింద కొనసాగుతున్న ప్రాంతీయ, కేంద్రీయ గ్రంథాలయాల నవీకరణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రంథాలయాలలోని రెండంస్తులలో కలియ తిరిగి జరుగుతున్న పనులను పరిశీలించి త్వరితంగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. రూ.65 లక్షలతో జరుగుతున్న ప్రాంతీయ గ్రంథాలయ నవీకరణ పనుల్లో ఇంకను అసంపూర్తిగా ఉన్న పనులు తక్షణమే పూర్తి కావాలని ఆదేశించారు. గ్రంథాలయం ముందు గోడపై ఇతర పుస్తకాలతో పాటు ప్రాంతీయ పుస్తకాలు, కవుల పేర్ల చిత్రీకరణ చేయాలని సూచించారు. పనికిరాని వస్తువులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రెండు లైబ్రరీలలో దివ్యాంగుల కొరకు ప్రత్యేక సదుపాయలతో గదిని కేటాయించాలని అన్నారు.

హన్మకొండలోని సెంట్రల్ లైబ్రరీలో రూ.81 లక్షల వ్యయంతో స్మార్ట్ సిటీ పథకంలో కొనసాగుతున్న నవీకరణ పనులను పరిశీలించి పనులు మందకొడిగా సాగడంపై గుత్తేదారునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెన్ అండ్ మెటీరియల్ అధికంగా ఏర్పాటు చేసుకొని ఎట్టిపరిస్థితుల్లోనూ పనులు వచ్చే నెలాఖరులోగా పూర్తికావాలని ఆదేశించారు. గుత్తేదారుల వెంట పడి పనులు సకాలంలో జరిగేలా నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో బల్దియా ఈఈ శ్రీనివాస్ రావు, లక్ష్మరెడ్డి, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ వోలెటి, డీఈ సంజయ్, సంతోష్ బాబు, ఏఈ అరవింద, తదితరులు పాల్గొన్నారు.