కరోనా పరీక్షల ఫలితాల పేరుతో వైద్యులు చేసిన కాలయాపన ఓ నిండు గర్భిణి ప్రాణాలు బలిగొంది. మృత శిశువును కడుపులో మోస్తూ అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఆ నిండు చూలాలి వేదన, వైద్య సిబ్బంది కరోనా భయం ముందు అరణ్య రోదనగా మారింది. దాదాపు 12 గంటలపాటు మృత్యువుతో పోరాడి అలసిన ఆ దీనురాలు, చివరకు కన్నుమూసింది. ఈ దారుణ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనికి చెందిన నాగరాజు భార్య హరిప్రియ 8 నెలల గర్భిణి. రెండు రోజుల క్రితం పురిటి నొప్పులు వస్తుండడంతో నాగరాజు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచనతో కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. హరిప్రియను పరీక్షించిన వైద్యులు, ఆమె గర్భంలో శిశివు మృతి చెందిందని నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండ ప్రసూతి ఆస్పతికి తీసుకెళ్లాలని సూచించారు.

దీంతో ! నాగరాజు ఈ నెల 25న హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిలో హరిప్రియను చేర్చారు. హరిప్రియ ఆయాసపడుతుండడాన్ని గమనించిన వైద్యులు, కరోనా అనుమానంతో ఆమె నమూనాలు పరీక్షకు పంపారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే వైద్యం చేస్తామన్నారు. ఎంతకీ ఫలితాలు రాకపోవడంతో, 12 గంటల పాటు నరకయాతన అనుభవించిన ఆ చూలాలు మృత్యుఒడికి చేరింది. తన భార్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి భర్త, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హరిప్రియ ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమా సరళాదేవి పేర్కొన్నారు..