చోరీ చేసేందుకు వచ్చి దొంగ బావిలో పడిన ఘటన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాఘవపూర్‌లోని డబుల్ బెడ్ ఇళ్లలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి వచ్చారు. ఈ ముగ్గురు అనుమానంగా కనబడడంతో వారిలో ఒకరిని పట్టుకొన్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. మిగిలిన ఇద్దరు తప్పించుకొని పారిపోతుండగా ఓ వ్యక్తి జాతీయ రహదారి పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్తులు సహకారంతో పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ఉమర్‌గా గుర్తించారు. సెటాప్ బాక్సుల చోరీ కోసం వచ్చి తప్పించుకు పారిపోయే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.