వరంగల్: జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి కరోనా సోకినట్లు వైద్యులు ప్రకటించారు. జంగా ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు చేశారు. పరీక్షలో రాఘవరెడ్డికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆయనను జైలు నుంచి ఎంజీఎంకు జైలు అధికారులు తరలించారు. ఓ వ్యక్తిపై దాడి చేసి చంపుతానని బెదిరించిన నేరారోపణలతో నవంబరు 4న మడికొండ పోలీస్‌స్టేషన్‌లో జంగాపై కేసు నమోదైంది. ఐపీసీ 324, 447, 352, 365, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. రాఘవరెడ్డి గత నేరచరిత్ర, అప్పటికే అతడిపై రౌడీషీట్‌ ఉండటం, ప్రస్తుత కేసు తీవ్రత నేపథ్యంలో జిల్లా కోర్టులో వేసిన బెయిల్‌ పిటిషన్‌ను రెండు మాసాల క్రితమే న్యాయమూర్తి తిరస్కరించిన విషయం తెలిసిందే.