జనగామ: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని త్వరలోనే పోలీసులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. కాజీపేటకు చెందిన వ్యక్తి పైన దాడి చేసి చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదు అందడంతో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. జంగా రాఘవరెడ్డిపైన ఐపీసీ 24, 447, 352, 365, 427, 508 సెక్షన్లను నమోదు చేసి కిడ్నాప్, చంపుతానని బెదిరించడం, దౌర్జన్యం చేయడం, అవమానించడం, బలవంతంగా ఆస్తిని కాజేయడం, కొట్టడం వంటి ఆరోపణలతో కేసు నమోదైందని మడికొండ పోలీసులు తెలిపారు.

ఈ కేసులో రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించి మడికొండ పోలీస్ లు తెలిపిన వివరాలు ప్రకారం కాజీపేట ప్రశాంత్ నగర్ కు చెందిన తంగెళ్లపల్లి సమ్మయ్యను గత నవంబర్‌లో రాఘవరెడ్డి టేకులగూడెంలోని తన గెస్ట్ హౌస్ కు పిలిపించుకున్నాడని, డబ్బులు ఇవ్వాలని బెదిరించగా అందుకు సమ్మయ్య నిరాకరించడంతో రాఘవరెడ్డితో పాటు కుర్ల మోహన్ అనే వ్యక్తి సమ్మయ్యను గదిలో బంధించి కొట్టి, సెల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేసి ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడని సమ్మయ్య గత నెల 4న మడికొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.