అధికార టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇస్తున్నారు మండల సర్పంచులు. ఎమ్మెల్యే, జెడ్పి చైర్ పర్సన్, స్థానిక ఎంపిపి తీరుపట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే: హన్మకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలో 22 మంది అధికార పార్టీలో ఉన్నారు వీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని అనుకున్నట్లు ప్రాథమిక సమాచారం. గత కొంత కాలంగా అధికార పార్టీ ఎంపిపి ఆధిపత్యం ఎక్కువ కావడంతో పాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై స్పందించకపోగా సమావేశాల్లో తెలుపడానికి అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

ఆదివారం సాయంత్రం ఓ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక సమావేశం చేసుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉండి ప్రాధాన్యత, అవకాశాలు లేనప్పుడు ఎందుకు పార్టీలో ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక పదవులకు రాజీనామా చేసేదొక్కటే మార్గమని నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రజల కోరిక మేరకు నడుచుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి మిగతా జిల్లాలలో కూడా ఇదే అవలంభిస్తే టిఆర్ఎస్ కు గడ్డుకాలమే అంటున్నారు నిపుణులు, సీనియర్ రాజకీయ నాయకులు. చూద్దాం మున్ముందు ఇంకా ఎం జరిగేనో…