తెలంగాణలో రాజకీయం మారుతోంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న టీఆర్ఎస్‌ 2020 లో ఎదురుదెబ్బలను చవిచూసింది. ఈ ఏడాది మళ్లీ సత్తా చాటి మునుపటి ప్రదర్శనను చూపించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌పై ప్రజల్లో కనిపించిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేస్తుండగా కాంగ్రెస్ కూడా తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది.

ఇక వరంగల్‌ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అన్ని తామై వ్యవహరించేందుకు సిద్ధమవుతున్న కొండా సురేఖ, మురళి దంపతులు.. టీఆర్ఎస్‌పై రివెంజ్ తీర్చుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలు పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను కొండా దంపతులకే ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం సూత్రప్రాయం నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల పంపిణీ వంటి అంశాల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారని సమాచారం.