తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నరేందర్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ హరీశ్ శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలోని 25 డివిజన్లలో ఉన్న పేదలకు నిత్యావసర సరుకులు అందించే సమయంలో ఎమ్మెల్యే నరేందర్ లాక్ డౌన్ నిబంధనలను పాటించలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 3000 మంది ఉన్నచోట కనీసం సామాజిక దూరం పాటించలేదని ఆరోపించారు.

దీనికి సంబంధించిన ఫొటోలను బీజేపీ నేత పోలీసులకు ఇచ్చారు.వీటిని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలు అందరూ వరుసగా కూర్చుని ఉన్నారు. సామాజిక దూరం పాటించలేదంటూ ఆ ఫొటోలను చూపించారు. గతంలో ఆరెంజ్ జోన్‌లో పర్యటించారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తు చేశారు.