జనగాం: టీఆర్‌ఎస్‌ పార్టీలో ముసలం మొదలైంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ముత్తిరెడ్డి మాట తప్పారని సొంత పార్టీకి చెందిన తిప్పారపు విజయ్ ఆత్మహత్యయత్నం జిల్లా కేంద్రమైన జనగామలో సంచలనం సృష్టిస్తోంది. సోమవారం ఆయనపై సొంత పార్టీ నేతలే విమర్శలకు దిగడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట తప్పారంటూ ఆత్మహత్యాయత్నం చేసిన టీఆర్‌ఎస్ నాయకుడు విజయ్ సంచలన ఆరోపణలు చేసారు. అంబేడ్కర్ భవనం నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని చెప్పిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆ మాట తప్పారని విజయ్ ఆరోపించారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి ఇస్తామన్న స్థలంలో మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టారని, గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని, టిక్కెట్లు అమ్ముకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు. సొంత పార్టీకి చెందిన దళిత నాయకుడు విజయ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై పలు విమర్శలొచ్చాయి. జనగామ నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల భూకబ్జా దారుడిగా పేరు తెచ్చుకున్నారు.