వ‌రంగ‌ల్: ట్రెయినీ ఎస్సైపై అత్యాచార‌య‌త్నం చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డిపై వేటు ప‌డింది. ఐజీ నాగిరెడ్డి ఆదేశాల‌తో శ్రీనివాస‌రెడ్డిని స‌స్పెడ్ చేస్తున్న‌ట్లు మ‌హ‌బూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మంగ‌ళవారం సాయంత్రం ప్ర‌క‌టించారు. ఐజీ నాగిరెడ్డి పేరిట‌ జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో నిందితుడిపై బాధితురాలు చేసిన ఫిర్యాదును ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఆ వివ‌రాల ప్ర‌కారం: ట్రెయినీ ఎస్సైగా విధులు నిర్వ‌హిస్తున్న మ‌హిళా అధికారికి గ‌త కొన్నాళ్లుగా ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డి మెసేజ్‌లు పంపుతూ వేధిస్తున్నాడు. పంపిన మెసేజ్‌ల‌ను డిలీట్ చేస్తున్నాడు. అయితే ఇదే క్ర‌మంలో సోమ‌వారం రాత్రి 11:30ల స‌మ‌యంలో పోలీస్ స్టేష‌న్ నుంచి ట్రెయినీ అధికారికి ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డి కాల్ చేశాడు. బెల్లం అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతోంద‌ని, ఆక‌స్మిక త‌నిఖీలు చేయాల్సి ఉంద‌ని చెప్పి స్టేష‌న్‌కు రావాల్సిందిగా ఆదేశించాడు. పోలీస్ వాహ‌నంలో కాకుండా సొంత వాహ‌నంలో మ‌హిళా అధికారిని వెంట‌ తీసుకుని ఓ నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లాడు. వాహ‌నంలోనే అత్యాచారయ‌త్నం చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

ఈ మేర‌కు బాధితురాలు మంగ‌ళ‌వారం వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ్‌జోషిగా ఫిర్యాదు చేసింది. ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో ప్రాథ‌మిక ఆధారాల‌ను ప‌రిశీలించిన ఐజీ నాగిరెడ్డి ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డిని స‌స్పెన్ష‌న్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అదే స‌మ‌యంలో శ్రీనివాస‌రెడ్డిపై మ‌రిపెడ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసి విచార‌ణ బాధ్య‌త‌ల‌ను తొర్రూరు డీఎస్పీ వెంక‌ట‌ర‌మ‌ణ‌కు అప్ప‌గించారు. డిపార్ట్‌మెంట్‌లో జ‌రిగిన అనుహ్య సంఘ‌ట‌న‌తో పోలీస్‌శాఖ ఉన్న‌తాధికారులు షాక్‌కు గుర‌య్యారు. సున్నిత‌మైన అంశం కావ‌డంతో ఆచితూచి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

పొద్దున ప్ర‌శంస‌లు, సాయంత్రం స‌స్పెన్ష‌న్:

విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తిభ చూపినందుకు గాను ఉద‌యం ఎస్పీ కోటిరెడ్డి చేత ప్ర‌శంస‌లు అందుకున్న ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డి సాయంత్రం అదే ఎస్పీ చేత స‌స్పెన్ష‌న్ ఆర్డ‌ర్ పొంద‌డం గ‌మ‌నార్హం. మరిపెడ స్టేష‌న్ ప‌రిధిలో బెల్లం ప‌ట్టివేత‌లో ప్ర‌తిభ చూపినందుకు గాను మంగ‌ళ‌వారం ఉద‌యం మ‌హ‌బూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాల‌యంలో జ‌రిగిన విలేఖ‌రుల స‌మావేశంలో ఎస్‌హెచ్‌వో శ్రీనివాస‌రెడ్డికి ఎస్పీ కోటిరెడ్డి రివార్డు అంద‌జేశారు. ట్రెయినీ ఎస్సైపై అత్యాచార‌య‌త్నం ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సాయంత్రం స‌స్పెన్ష‌న్‌కు గురయ్యారు.