అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం. తన అక్కకు టాటా చెప్పేందుకు వెళ్లిన చిన్నారిని మృత్యువు బస్సు రూపంలో కబళించగా అప్పటివరకు ముద్దు ముద్దు మాటలతో మాట్లాడిన తమ కూతురు ఇక లేదనే చేదు నిజాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుళ్లూ గోపురాలు తిరిగితే దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే తీసుకెళ్లాడంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లిలో బుధవారం స్కూల్ బస్సు కిందపడి ఓ చిన్నారి ప్రా ణాలు కోల్పోయిం ది. కాట్రపల్లికి చెంది న జ్యోత్స్న, అమరేందర్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సమ్మిత మామునూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నది.

ఈ క్రమంలో రోజు మాదిరిగానే బుధవారం సమ్మితను పాఠశాలకు పంపేందుకు చిన్న కూతురు మనస్విత(2)తో కలిసి తల్లి జోత్స్న బస్సు వద్దకు వచ్చింది. సమ్మితను బస్సు ఎక్కించే క్రమంలో చిన్న కుమార్తె ప్రమాదవశాత్తు బస్సు ముందు టైరు కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవర్ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడపడంతోనే తన కూతురు మృతిచెందిందని తండ్రి అమరేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.