నా బిడ్డను ఎత్తుకెళ్లారు, ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ముగ్గురు యువకులు ఏడాదిగా అత్యాచారం చేస్తున్నారు. దుబాయ్‌ షేక్‌లకు, రెడ్‌ లైట్‌ ఏరియాకు అమ్మేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ చేస్తున్నారు’ అంటూ ఓ తండ్రి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట ఏసీపీ బి. రవీంద్రకుమార్‌ తెలిపారు.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం: బాధిత బాలిక తండ్రి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌ మండలం బీరంగూడలో ఉంటున్నాడు. గతంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట బాపూజీనగర్‌లో ఉండగా, ఆయన మూడో సంతానమైన బాలిక(14)ను పొరుగింట్లో ఉండే గజేంద్ర (24) లోబర్చుకొని ఏడాదిపాటు అత్యాచారం చేశాడు. దీనిపై నిలదీయగా బాలికను తనకిచ్చి పెళ్లి చేసి, కుటుంబమంతా ఊరు విడిచి వెళ్లిపోవాలని బెదిరించాడు. దీంతో బాలిక కుటుంబం సంగారెడ్డి జిల్లాకు వలసపోయింది. అక్కడికి కూడా వెళ్లిన గజేంద్ర.. బాలికను అపహరించాడు. దీనిపై ఆ జిల్లాలో గజేంద్రపై రేప్‌, కిడ్నాప్‌ కేసు నమోదు చేసి, రిమాండ్‌ చేశారు. బెయిల్‌పై విడుదలైన గజేంద్ర మరోసారి బాలికను ఎత్తుకెళ్లి ధర్మసాగర్‌ మండలం సాయిపేటకు చెందిన దిలీ్‌పకుమార్‌ ఇంట్లో దాచాడు.

ఈ క్రమంలో తన కూతురిపై ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని తండ్రి పేర్కొన్నారు. అనంతరం కరుణాకర్‌ అనే మధ్యవర్తితో, దిలీ్‌పకుమార్‌తో పెళ్లిచేశారన్నారు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఎవరో ఫోన్‌ చేసి కేసు రాజీ చేసుకోవాలి, మీ కూతురుని దుబాయ్‌ షేక్‌లకు, ముంబై రెడ్‌లైట్‌ ఏరియాకు అమ్మేస్తామని బెదిరిస్తున్నారు. కాగా, బాలిక తండ్రి తనకు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌ తెలిపారు. గతంలోనూ కూతురు కనపడడం లేదంటూ ఆయన కోర్టును ఆశ్రయించారని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యే కాజీపేట పోలీసులు బాలికను వెతికి పట్టుకొని కోర్టులో హాజరుపర్చారన్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని కోర్టు సూచించినా వినకుండా, సదరు బాలిక దిలీ్‌పకుమార్‌తో వెళ్లిపోయినట్లు తమకు సమాచారం ఉందన్నారు.