సమయం ఉదయం 8 గంటలు, ఓ అందమైన అమ్మాయి పరకాల బస్టాండ్‌కు కారులో చేరుకొని ప్రయాణికురాలిలా ప్లాట్‌ఫాంపై వేచి చూస్తోంది. ఆమెను ఎక్కడో చూసినట్లు ప్రయాణికులు గుర్తు చేసుకునే లోపే, ఫిదా సినిమా హిరోయిన్‌ సాయిపల్లవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. విరాట పర్వం సినిమా షూటింగ్‌లో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల బస్టాండ్‌లో సాయిపల్లవి ఆర్టీసీ బస్సు కోసం ఎదరుచూసే దృశ్యాలను బుధవారం చిత్రీకరించారు.

ఆమెను స్థానికులు గుర్తిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో బస్టాండ్‌ ఎదురుగా ఉన్న లాడ్జ్‌ నుంచి చిత్రీకరించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ దృశ్యాలను ఫొటో తీయగా అక్కడే ఉన్న సినిమా షూటింగ్‌ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌లోని దృశ్యాలను బలవంతంగా తొలగించారు. మరికొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో సాయిపల్లవిని బంధించే ప్రయత్నం చేసేలోపే ఆమె షూటింగ్‌ పూర్తి చేసుకుని సొంత వాహనంలో కాళేశ్వరం వెళ్లిపోయారు. ఓ ప్రయాణికుడు తీసిన సాయిపల్లవి ఆరు సెకన్ల విడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.