భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రుద్రారంకు చెందిన రాగిణిని ఆమె తల్లిదండ్రులు గతేడాది నవంబర్‌లో భూపాలపల్లికి చెందిన హరిశంకర్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. రాగిణి, హరిశంకర్ దంపతులు భూపాలపల్లిలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. హరిశంకర్ పాన్‌షాపులకు సామాగ్రిని సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత నెలలో భార్యభర్తలు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆవేశంతో హరిశంకర్ భార్యపై వేడి టీ పోశాడు. దీంతో తీవ్రంగా కలత చెందిన రాగిణి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు భూపాలపల్లికి వచ్చి కూతురుని వారి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో హరిశంకర్ కొద్ది రోజులు భార్యకు దూరంగా ఉన్నాడు. ఇక, బుధవారం రుద్రారంలోని భార్య పుట్టింటికి వెళ్లిన హరిశంకర్ రాగిణిని తనతో పంపించాలని ఆమె తల్లిదండ్రులను కోరాడు. ఇకపై ఆమెను ఇబ్బంది పెట్టనని, జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడు.

అయితే ఆ మాటలు నమ్మిన రాగిణి తల్లిదండ్రులు ఆమెను హరిశంకర్‌తో పంపించారు. అయితే రాగిణిని తనతో తీసుకెళ్లిన తర్వాత హరిశంకర్ తన ప్లాన్‌ను అమలు చేశాడు. గురువారం ఉదయం రాగిణి గొంతుకోసం హత్య చేశాడు. ఆ తర్వాత కత్తిని రాగిణి చేతిలో పెట్టి పారిపోయాడు. ఇక, ఉదయం నుంచి రాగిణి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కలవారు అనుమానంతో లోపలికి వెళ్లి చూశారు. అక్కడ రాగిణి మృతిచెంది కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. రాగిణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక, మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.