గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే: జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ గ్రామ శివారు శివారెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొని మీదికొండ గ్రామానికి చెందిన చిలువేరు రాజు (29) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా అతని తమ్ముడు రవి తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థుల కథనం ప్రకారం: మీదికొండ గ్రామానికి చెందిన చిలువేరు రాజును అతని తమ్ముడు చిలువేరు రవి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో దించేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో చాగల్ శివారు శివారెడ్డిపల్లి వద్ద ఘన్‌పూర్ వైపు వస్తున్న బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా రాజు అక్కడికక్కడే మృతి చెంది రవి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.

గాయపడిన రవిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాజుకు ఏడాది క్రితమే పెళ్లి జరిగిందని, భార్య నాలుగు నెలల గర్భవతి అని, మృతుడి తమ్ముడు రవికి మరో పది రోజుల్లో వివాహం జరిపేందుకు నిశ్చయించినట్లు తెలిపారు. ఆనందంగా పెళ్లి పనులు చేసుకోవాల్సిన ఇంటిలో సంఘటన చోటు చేసుకోవడముతో వారి కుటుంబములో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.