ప్రేమ జంట ఒక్కటైంది, ఇష్టం లేని వ్యక్తితో బలవంతంగా వివాహం చేస్తున్నారని ఓ యువతి పీటల మీద పెళ్లిని అడ్డుకున్న విషయం విదితమే. అయితే, శుక్రవారం ప్రేమికులిద్దరూ ఓ ఆలయంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల గుండెపుడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్య వివాహాన్ని పెద్దల సమక్షంలో నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో గురువారం మరిపెడలో వివాహం జరుగుతున్న క్రమంలో వధువు పెళ్లి పీటల మీద నుంచి లేచి 100కు నంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను ప్రేమించినట్లు చెప్పింది. పోలీసులొచ్చి చెప్పినా వినకపోవడంతో పెళ్లి రద్దయింది. దీంతో మరుసటిరోజు శుక్రవారం మహబూబాబాద్‌ మండలం అనంతారం జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో దివ్య, నరేశ్‌ దండలు మార్చుకున్నారు.