జనగామ: ప్రజా సేవ చేయడానికి పదవులు, ప్రోటోకాల్ అవసరం లేదని మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన కడియం శ్రీహరి అనంతరం మీడియాతో మాట్లాడారు: ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. నియోజకవర్గానికి రావడానికి ఎవరి లైసెన్స్, అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని ధ్వజమెత్తారు. తనకి రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు పదవి ఉన్నా, లేకున్నా అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యం అన్నారు.

ప్రజలకు మేలుచేసే పనులు ఎవరూ చేసిన స్వాగతించి, అభినందించాలని పిలుపునిచ్చారు. పార్టీకి కట్టుబడి మాత్రమే ఉంటామని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి నిజాయితీగా పని చేస్తాడని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటాడని ప్రజల్లో తనకు గుర్తింపు ఉందన్నారు. దేవాదుల సాగునీరు గురించి మాట్లాడని వారు, దేవాదుల పట్ల అవగాహన లేని వారు హడావుడి చేయడం విడ్డురంగా ఉందని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.