{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1625738478237","source":"other","origin":"gallery"}

ఉమ్మడి వరంగల్‌లోని బయ్యారం పెద్ద చెరువు, ములుగు జిల్లాలోని రామప్ప చెరువుకు చరిత్రాత్మక నేపథ్యం ఉంది. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని సోదరి మైలాంబ తన తల్లి బయ్యాలదేవి (బయ్యమాంబ) పేరు మీదుగా బయ్యారం పెద్దచెరువును 12వ శతాబ్దంలో నిర్మించారు. అప్పడి నుంచి సాగునీటి వనరుగా ఈ చెరువు ప్రసిద్ధి పొందింది. ఈ చెరువు గార్ల, బయ్యారం మండలాలకు సుమారు 10 నుంచి 12 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అలాగే రామప్ప చెరువును గణపతి దేవుడి సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ 1213లో నిర్మించినట్లు దాని పక్కనే ఉన్న శివాలయంలోని శాసనం తెలుపుతోంది. రెండు గుట్టల మధ్యలో ఆనకట్ట నిర్మించడం వల్ల ఇది కాకతీయుల కాలంలో నిర్మించిన వాటిలో లోతైన చెరువుగా నిలిచింది. ఇది అధికారికంగా 6వేల ఎకరాలకు, అన ధికారంగా 5 వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. అలాగే నాలుగు మండలాల గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తోంది. కేవలం వర్షం నీరే ఆధారమైన దీనికి రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఈ చెరువులోకి విడుదల చేస్తూ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మార్చింది. ఇక్కడి నుంచి పాకాల, గణపురం చెరువులకు నీటిని తరలిస్తున్నారు.

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రెండు చెరువులు ఇప్పటికీ సాగునీరందిస్తూ మనుగడలో ఉండడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రపంచ పర్యాటక ముఖచిత్రంలో చోటు బయ్యారం పెద్దచెరువు, రామప్ప చెరువులకు ప్రపంచ పర్యాటక గుర్తింపు లభిస్తే అవి అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తాయి. ఇప్పటికే సందర్శకులతో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయి. ఐసీఐడీ ఆమోదం తర్వాత మరింత అభివృద్ధి చెందడంతో పాటు విదేశీ పర్యాటకులు సందర్శించే అవకాశాలున్నాయి. ఫలితంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మరింత పర్యాటక శోభ రానుంది.