పర్వతగిరి: ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి మాయమాటలు చెప్పి తన కూతురిని (మైనర్‌) తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతుడికి (35) భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన వ్యవసాయం చేస్తుండగా, భార్య కుట్టుమిషన్‌ కుడుతూ కుటుంబానికి చేదోడుగా ఉంటోంది. ఆన్‌లైన్‌ తరగతుల కోసమని సెల్‌ ఫోన్‌ ఇవ్వగా ఫేస్‌బుక్‌లో ఖాతా సృష్టించుకున్న కూతురు మిత్రులతో చాటింగ్‌ చేసేది. ఈ క్రమంలో పరిచయమైన వ్యక్తితో జూన్‌ 7న వెళ్లిపోయింది.
పలు చోట్ల వెదికిన తండ్రి అదే నెల 8న ఆమె తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఖమ్మం సమీపంలోని కరకగూడెంకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. భూపాలపల్లి సమీపంలోని ఆజాంనగర్‌కు వెళ్లి విచారించారు.

వారితో పాటు స్థానికంగా ఉన్న పలువురిని విచారించడమే కాకుండా గ్రామం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే సీసీ టీవీ ఫుటేజీలను సైతం పరిశీలించారు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో బాలిక తండ్రి శుక్రవారం ఠాణా సమీపంలో పురుగు మందు తాగాడు. స్థానికులు, పోలీసు సిబ్బంది ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదైంది.