టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ (ప్రభుత్వ చీఫ్ విప్), ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వర్షపాతం వరంగల్ లో నమోదు కావడంతో వరదలు వచ్చాయని అన్నారు. వరదల కారణంగా 12వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని నిన్న జీడబ్ల్యూఎంసీ మీటింగ్ లో తీర్మానం చేశామని అన్నారు. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్, అరవింద్ గల్లీలో కాకుండా ఢిల్లీలో కూర్చొని రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలన్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురండని సూచించారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని అన్నారు. కేటీఆర్ వరంగల్ లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద 25కోట్ల రూపాయలు ప్రకటించారని అన్నారు.

చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ: కీలక వ్యాఖ్యలు చేసారు. సర్కారు పనులన్తేనే కాంట్రాక్టర్ లకు భయం అని అన్నారు. వరంగల్ లో అయితే కాళ్ళు మొక్కినా సరే కాంట్రాక్టర్ లు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. చేసిన పనులకు బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదు అని చల్లా ధర్మారెడ్డి ఆరోపణలు చేసారు. నేను కూడా బిల్లుల కోసం తిరుగుతున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. క్వాలిటీ పేరిట 20 శాతం కట్ చేస్తే కాంట్రాక్టర్ బతకాలా చావాలా అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కొనైమాకుల లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 4కోట్ల పనుల్లో ఎలాంటి పనులు చేయకుండానే 2 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్నారు.