పెళ్లంటే బంధుమిత్రుల సందడి, భోజనాలు, బరాత్‌లు, ఇలా చెప్పుకుంటే జీవితంలో మరిచిపోలేని ఈ ఘట్టాన్ని అట్టహాసంగా జరుపుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వివాహాలను కొందరు వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు తప్పని పరిస్థితుల్లో సాదాసీదాగా చేసుకుంటున్నారు.

వరంగల్ సంగెం మండలం కాపులకనపర్తికి చెందిన జిట్టా జార్జి-సుమలత కుమార్తె భవానీ వివాహం గీసుగొండ మండలం ఎల్కుర్తి హవేలీకి చెందిన మంద స్వామి – పద్మ కుమారుడు శ్యాంతో గతంలోనే నిశ్చయమైంది. అయితే, పెళ్లి బుధవారం జరగాల్సి ఉండగా, వారు సర్పంచ్‌ ఎర్రబెల్లి గోపాల్‌రావు, ఎంపీటీసీ సభ్యుడు సుతారి బాలకృష్ణను సంప్రదించగా సాదాసీదాగా కుటుంబీకుల నడుమ పెళ్లి జరుపుకోవాలని సూచించారు. దీంతో బుధవారం వధువు ఇంటిలో ఇరువురి తల్లితండ్రుల సమక్షంలో దండలు మార్చుకున్న వధూవరులు ఆ తర్వాత చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు.