ఒకే పార్టీలో ఉన్న మంత్రి- ఎమ్మెల్యే – ఎంపీలు మాట్లాడుకోరు. తమకు దక్కాల్సిన పదవిని తమ చేతిలో ఓడిపోయిన మహిళకు ఇవ్వడాన్ని ఆ సీనియర్ ఎమ్మెల్యే జీర్ణించుకోవడం లేదు. అందుకే కేసీఆర్ ఎంత చేసినా చెప్పినా కూడా ఆ మహిళా మంత్రిని దగ్గరకు రానీయడం లేదట పూర్వపు వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గ కథ ఇదీ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు – ఆ జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్ కు పచ్చగడ్డి వేసే భగ్గుమనేలా విభేదాలు పొడచూపుతున్నాయని జిల్లాలో కథలు కథలుగా చెబుతున్నారు.

ఇక రెడ్యానాయక్ తోపాటు ఆయన కూతురు

మహబూబాబాద్ ఎంపీ కవిత కూడా మంత్రి సత్యవతితో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. రెడ్యానాయక్ ఆరు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. డబుల్ హైట్రిక్ కొట్టారు. రెడ్యా నాయక్ చేతిలోనే మొన్నటి ఎన్నికల్లో సత్యవతి రాథోడ్ ఓడారు. కానీ టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత మహిళా ఎస్టీ కోటాలో ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. ఇలా తనకు దక్కాల్సిన మంత్రి సీటును కొట్టేసిన సత్యవతి పై రెడ్యానాయక్ – ఆయన కూతురు ఎంపీ మాలోతు కవిత ఆగ్రహంగా ఉన్నారు.

తాజాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా కురివి మండలం కొందికొండ జాతరలో ఎదురుపడ్డ మంత్రి సత్యవతి వర్సెస్ రెడ్యానాయక్ – కవితలు కనీసం పలకరించుకోకపోవడం టీఆర్ ఎస్ వర్గాలను షాక్ కు గురిచేసింది. ఇదే కాదు మంత్రి హోదాలో సత్యవతి పిలిచే రివ్యూలకూ ఈ తండ్రీకూతుళ్లు రావడం లేదు. ఇలా ఉప్పు-నిప్పులా ఒకే పార్టీలో ఉంటూ టీఆర్ ఎస్ కార్యకర్తలు – నేతలను వీరిద్దరూ ఇబ్బందులు పెడుతున్నారన్న చర్చ పార్టీలో సాగుతోంది.