రాష్ట్ర ప్రభుత్వ రాయితీతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సైయంట్‌ (ఐటీ కంపెనీ) భవనం పనులు పూర్తి చేసుకొని ముస్తాబవుతోంది. కాజీపేట మండలం మడికొండ ఎస్‌ఈజడ్‌ (స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌)లో ఐదు ఎకరాల స్థలంలో సైయంట్‌ కంపెనీ యాజమాన్యం రూ.20 కోట్లతో నిర్మించింది. భవనానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా శిలాఫలకం వేశారు.

ప్రస్తుతం తాత్కాలికంగా ఐటీ ఇంక్యుబేషన్‌ టవర్‌లో 70 మంది ఉద్యోగులతో రెండు విడతలుగా సైయంట్‌ కంపెనీ హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా సాగుతోంది. కొత్త భవనం ప్రారంభమైతే 400 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన నియామక ప్రక్రియను త్వరలో చేపట్టనున్నట్లు సమాచారం. ఆధునిక సాంకేతిక విలువలు జోడించి నిర్మిస్తున్న మొట్టమొదటి ఐటీ కంపెనీ భవన సముదాయం వరంగల్‌ జిల్లాలో సైయంట్‌ నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.