గీసుకొండ: భర్త నిత్యం మద్యం తాగొచ్చి కొడుతుండడంతో తట్టుకోలేక ఓ మహిళ ఇటుకలతో కొట్టగా ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి: గూడూరు మండలం నాంపల్లికి చెందిన నాగమణిని శనిగరం కార్తీక్‌ (35) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, నాలుగేళ్ల నుంచి నాగమణి అక్కతో కార్తీక్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో ఆమెను భర్త వదిలేశాడు. దీంతో నాగమణి, ఆమె అక్కతో కలసి కార్తీక్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో నివాసం ఉంటున్నాడు.

కార్తీక్‌ తరచూ నాగమణిని కొడుతుండగా, ఇటీవల గాయపడిన ఆమె హన్మకొండలో చికిత్స చేయించుకుంది. అక్కడి నుంచి నాగమణి మరో సోదరి సుగుణ నివాసముండే కీర్తినగర్‌కు ఈనెల 11న వచ్చింది. అదేరోజు రాత్రి కార్తీక్‌ మద్యం తాగొచ్చి గొడవ పడగా, నాగమణి భర్తను నెట్టి వేయడంతో కింద పడ్డాడు. ఆమె ఇటుకలతో కార్తీక్‌ను తీవ్రంగా కొట్టింది. గాయపడిన అతడిని 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు.