పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చి ఇక్కడ పని చేస్తున్న ఇటుకబట్టి కార్మికులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘మా గూటికి మమ్మల్ని పంపించండి’ అంటూ అధికారులను వేడుకుంటున్నారు. వరంగల్‌ జిల్లా శాయంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్‌ను కలిసి సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. వివరాల్లోకి వెళితే:

ఒడిషా రాష్ట్రం నుంచి 14మంది కార్మికులు ఇటుకబట్టిలో పనిచేసేందుకు వచ్చారు. టేకేదార్‌ గోవిందు సునతుండా వారిని తీసుకొచ్చి మండలంలోని మందారిపేట స్టేజి వద్దనున్న సాంబయ్య ఇటుక బట్టికి పంపించారు. డిసెంబర్‌ నుంచి మే 6 వరకు కార్మికులు పని చేయాల్సి ఉంది. కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో పనులు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సమయంలో కార్మికులకు యజమాని బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చారు. అయితే, తమ ప్రాంతాలకు వెళ్లిపోవడానికి ఒక్కొక్కరికి రూ.250 మాత్రమే చెల్లించారని, ఇంకా తమకు డబ్బులు రావాల్సి ఉందని కార్మికులు అంటున్నారు. పనులు చేస్తేనే డబ్బులు ఇస్తామంటున్నారని, కానీ, తాము పిల్లలను వదిలి వచ్చామని ఆందోళన చెందుతున్నారు.

బుధవారం ఉదయం కాలినడకన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. తమ ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని సాయంత్రం వరకు నిరీక్షించారు. ఇదే విషయమై యజమాని సాంబయ్యను వివరణ కోరగా, టేకేదార్‌తోనే డబ్బుల లావాదేవీలు ఉంటాయని, కార్మికుల వేతనం మొత్తం ఆయనకు అప్పగించామని అన్నారు. లాక్‌డౌన్‌ ముగిసినాక రైళ్ల పునరుద్ధరణ అయ్యాక పంపిస్తామని చెప్పినప్పటికీ కార్మికులు వినకుండా వెళ్లిపోతున్నారని తెలిపారు. అయితే, కార్మికుల విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్తామని ఎస్‌ఐ అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పై నుంచి వచ్చే సమాచారం ఆధారంగా వలస కార్మికులు వెళ్లడానికి కేటాయించిన బస్సు వద్దకు, శ్రామిక రైలు వద్దకు పంపిస్తామని తెలిపారు. ఇటుక బట్టి యజమానితోనూ మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు.