వరంగల్: అమరవీరుల సంస్మరణ దినం. చరిత్ర మరచిన రోజు72 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే 1947 సెప్టెంబర్ 2 న వరంగల్ జిల్లా పరకాలలో జాతీయ జండా పట్టుకొని నిలబడిన వందలాది మంది పై కాల్పులు జరిపారు రజాకారులు. గొడ్డళ్ళతో నరికి, బరిసెలతో పొడిచి, చెట్లకు కట్టేసి కాల్చి చంపిన దినం. హైదరాబాద్ సంస్థానంను భారత్ లో విలీనం చేయాలని భారత జాతీయ జెండా ఎగురవేయడానికి వస్తున్నారు గ్రామస్తులు.

నరహంతకుడు, రజాకార్ల నాయకుడూ అయిన కాశీంరజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, నిజాం సైనికులు వారిపై దాడిచేశారు. కత్తులు, బళ్ళాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 14 మంది అక్కడికక్కడే అమరులయ్యారు. తర్వాత మరో పదిమంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వీరులకు జోహార్లు అమరధామం ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు తన తల్లి గారైన చంద్రమ్మ స్మారకార్థం పరకాలలో అమరవీరులకు గుర్తుగా అమరధామం” 2003 లో నిర్మించారు.

అమరధామంలో ఆనాటి యోధుల సజీవ శిల్పాలు, చెట్టుకు కట్టేసి చంపిన తీరు వివరించబడ్డాయి. స్మారక చిహ్నం చుట్టూ జాతీయ జెండా చేతబట్టిన 135 మంది స్త్రీ పురుషుల విగ్రహాలను నిర్మించారు. నరికిన శరీర భాగాలు, అవయవాలు, చిందిన రక్తం, ధారలుగా కారుతున్న రక్తం చూస్తే, ఇప్పుడే జరిగిన సంఘటనగా అనిపించేటట్లు ఉంటుంది. ప్రతి తెలంగాణ బిడ్డ తప్పక చూడాల్సిన ప్రదేశం.