కరోనా మరోసారి పంజా విసురుతోంది, లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ప్రజలు కరోనా నిబంధనలను పక్కనబెట్టి యథేచ్ఛగా తిరుగుతుండడంతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాల్లో వైరస్‌ ఉధృతి తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు కరోనా కేసులు పెరిగిన గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో సుమారు నెల రోజుల నుంచి కరోనా మరణాలు నమోదు కాలేదు. అధికారిక లెక్కల ప్రకారం గురువారం 79 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ప్రజలంతా అప్రమత్తంగా లేకుంటే ఇదే స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కరోనా విస్తరించే ప్రమాదముందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీని పరిధిలోకి వచ్చే వీరనారాయణపురం గ్రామంలో ఏకంగా 47 మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌కు త్వరలో ఉపఎన్నిక జరిగే అవకాశమున్నందున అన్ని రాజకీయ పార్టీలు ఇపుడు నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచుతున్నారు.

ఈ నియోజకవర్గంలో భాగమైన కమలాపూర్‌ మండలంలో కూడా ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే ఇదే స్థాయిలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. కమలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 1 నుంచి 8 వరకు 1,349 మందికి కరోనా పరీక్షలు చేయగా 124 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ 19 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రాజకీయ పార్టీల కార్యకలాపాలు పెరగడంతో కమలాపూర్‌ మండలంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇంటింటా సర్వే చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేస్తున్నారు. అవసరమైతే కమలాపూర్‌ మండలంలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

పీహెచ్‌సీల్లోనే ఆర్టీపీసీఆర్‌:

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులతో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గతంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించేవారు. టెస్ట్‌ల సంఖ్య పెంచాలన్న కారణంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆదమరిస్తే ఆగమే:

లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో కరోనా లేదు, రాదు, అన్న ధీమాతో ఎవరూ కరోనా నిబంధనలు పాటించడం లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. భౌతికదూరం పాటించడం ఎప్పుడో మానేశారు. మాస్క్‌ సైతం వాడడం తగ్గించేశారు. శానిటైజేషన్‌ చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో మరోసారి కరోనా విపత్తును ఎదుర్కొనే దుస్థితి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని గతంలోనే శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆదమరిచి ఆగం కావొద్దని హెచ్చరిస్తున్నారు.