వరంగల్: జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి, మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశం అయ్యారన్న సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లాలోని నల్లబెల్లి మండలం మేడపల్లి, కొండాపురం, మురళీనగర్ గ్రామాలను చుట్టుముట్టారు. భారీ స్థాయిలో పోలీసులు మోహరించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. దీంతో పోలీసులు ఉమ్మడి వరంగల్‌పై దృష్టి సారించారు. మావోల కదలికలపై డేగ కన్నుతో నిఘా పెట్టారు.

నల్లబెల్లి మండలంలో పోలీసుల కూంబింగ్:

వరంగల్ రూరల్: జిల్లాలోని నల్లబెల్లి మండలం మేడిపల్లిలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. కొండాపురం, మురళీనగర్ గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. మహాముత్తారం మండలం సింగారంలో మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌ చేశారు. ఐదుగురి నుంచి భారీగా జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు స్వాధీనం చేస్తున్నారు.