ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల పరిధిలో మావోయిస్టుల రీ ఎంట్రీతో పాటు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పెరిగిందన్న సమాచారం మేరకు స్థానికంగా పార్టీ నూతన కమిటీల నియామకంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన రోజునే మావోయిస్టు పార్టీ తమ సంస్థాగత నిర్మాణం చేపట్టి పలు ఏరియా కమిటీలను ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో ఆయన ఘాటుగా స్పందించినట్లు చర్చ జరుగుతున్నది. పార్టీలో జరిగిన నూతన సంస్థాగత నియామకాలు. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల పరిధిలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఎస్పీ జిల్లా పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. మావోయిస్టులు తమ ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వస్తున్న నిఘా వర్గాల సూచనల మేరకు మరింత అప్రమత్తంగా ఉండాలని రెండు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించి.. ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నూతన కమిటీలపై ఆరా:

ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల పరిధిలో ని గోదావరి పరీవాహక ప్రాంత మండలాల పరిధిలో ఉన్న మహదేవ్‌పూర్‌, ఏటూరునాగారం ఏరియా కమిటీకి రీనా అలియాస్‌ సమే, వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీకి ఉంగీని నియమించినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, పెద్దపెల్లి జిల్లా ఏరి యా కమిటీని కంకణాల రాజిరెడ్డి నేతృత్వంలో కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ యాక్షన్‌ టీం బాధ్యతలను మరో సీనియర్‌ మావోయిస్టు నేత బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌కు అప్పగించినట్లు సమాచారం.

ముమ్మరంగా తనిఖీలు|పటిష్ట భద్రత:

ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టు ఏరియా కమిటీలకు నూతన బాధ్యులను అప్పగించినట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి వాహనాల రాకపోకలపై పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. రెండు జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ మావోయిస్టు కార్యకలాపాల కట్టడిపై తనదైన శైలిలో దృష్టి సారించారు. శనివారం డీజీపీ పర్యటన పూర్తిగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం మండలాల్లో జరుగడం పోలీసు వర్గాల నైతికైస్థెర్యం పెంపొందించేదిగా ఉన్నదని సీనియర్‌ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టుల కదలిక నేపథ్యంలో డీజీపీ పర్యటన రెండు జిల్లాల పోలీసుల సిబ్బందిని అలర్ట్‌ చేసింది. వారం రోజులుగా ఈ ప్రాంతంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలను ప్రత్యేక పోలీసు బలగాలతో జల్లెడ పడుతున్నట్లు సమాచారం. అయితే, స్థానిక పోలీసుస్టేషన్ల భద్రతతో పాటు ప్రజాప్రతినిధుల రాకపోకలపై పోలీసు ఉన్నతాధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు.