మావోయిస్టుల సమాచారం ఇస్తే బహుమతులు ఇస్తామని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలవ్యాప్తంగా పోలీసులు గోడపత్రికలను అంటించారు. వీటిని దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టులతో పాటు గ్రామాల్లో జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో ఉంచారు. వీటిలో యాక్షన్‌ టీం సభ్యుల మీద రూ.5లక్షల వరకు మిగతా వారిపై రూ.20 లక్షల వరకు రివార్డును ప్రకటించారు. ఛత్తీస్‌గడ్‌ నుంచి మన సరిహద్దులోకి మావోయిస్టులు చొరబడుతున్నారనే నేపథ్యంలో ప్రచారం చేస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఎవరైనా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరాలు చెప్పవచ్చని పేర్కొన్నారు.

మావోయిస్టుల కదలికలపై నిఘా: డీజీపీ మహేందర్‌రెడ్డి

మావోయిస్టుల కార్యకలాపాలు, కదలికలపై అన్ని ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వరంగల్‌ ఎన్‌ఐటీలో వరంగల్‌, కరీంనగర్‌ కమిషనరేట్ల అధికారులు, ఎస్‌హెచ్‌వో స్థాయి అధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నేర నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పోలీసు యంత్రాంగం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణలోకి మావోయిస్టులు మరోమారు రాకుండా ఉం డేందుకు ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేశామని చెప్పారు. అదేవిధంగా కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో డీజీపీ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంత రం విలేకరులతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారికి చేరువయ్యేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డీజీపీ వెంట ఐజీలు నాగిరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, ప్రభాకర్‌రావు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.