ఓరుగల్లు పురపోరులో సత్తా చాటాలనుకున్న నేతల ఆశలకు ఆదిలోనే చెక్‌ పడిందా? డివిజన్ల పెంపు లేక, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలన్న ప్రచారంతో ఫీజులు ఎగిరిపోతున్నాయా? ఇదే సమయంలో మేయర్‌ పీఠం కోసం అధికార పార్టీలో పావులు కదిపేవారు ఎక్కువయ్యారా.? గ్రేటర్‌ వరంగల్‌లో డివిజన్ల పెంపులేదా..?

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలు ఒకేసారి జరిపేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సంకేతాలు ఇస్తోంది. అలాగే వరంగల్‌లో డివిజన్ల పునర్విభజన ఉండబోదని. రిజర్వేషన్ల ప్రక్రియలోనూ ఎలాంటి మార్పులు ఉండవని గుసగుసలు మొదలయ్యాయి. ఈ దిశగా గులాబీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయట. ఒకవేళ GHMCతోపాటు ఎన్నికలు జరపాలంటే సమయం సరిపోదు కాబట్టి, డివిజన్లు పెంపు వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఉండదని అనుకుంటున్నారు.

66 డివిజన్లలో పురపోరు ఉంటుందని ఆశించారు.!

2019 పురపాలిక చట్టం ప్రకారం GHMC మినహా తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. ఆ విధంగా 2019 జూన్‌లో గ్రేటర్‌ వరంగల్లో డివిజన్ల సంఖ్యను 58 నుంచి 66కు పెంచుతూ ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేశారు. 66 డివిజన్లకు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అప్పుడున్న CDMA శ్రీదేవి టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కొన్ని చర్యలు తీసుకున్నారు. వరంగల్‌లో 66, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మంలలో 60 డివిజన్లు ఉంటాయన్నారు. ఇటీవల పురపాలక శాఖ విడుదల చేసిన LRS పోర్టల్‌, పట్టణ ప్రగతి అభివృద్ధి ప్రణాళికల్లో గ్రేటర్‌ వరంగల్‌లో 66 డివిజన్లను చూపెట్టారు. ఆగస్టులో ఇక్కడ పర్యటించిన మంత్రి KTR సైతం 66 డివిజన్ల అంశాన్ని ప్రస్తావించారు. దాంతో ఓరుగల్లు పురపోరు 66 డివిజన్లలో జరుగుతుందని అంతా ఆశించారు.

58 డివిజన్లలోనే పోరు అనడంతో నేతల్లో నిరాశ.!

మారిన పరిణామాలతో 66 కాదు, పాత 58 డివిజన్లలోనే ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నారట. వీటిల్లో 29 డివిజన్లు మహిళలకు రిజర్వ్‌ అయి ఉన్నాయి. ఒకవేళ 66 డివిజన్లు అయి ఉంటే. రిజర్వేషన్లు మారతాయని ఊహించారు. ఆ మేరకు నాయకులు పోటీకి ప్రణాళికలు వేసుకున్నారు. కానీ వరంగల్‌ ఎట్‌ 58 అని అనడంతో చాలా మంది నీరస పడ్డారట. ఆ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వరంగల్‌ జిల్లా నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ సైతం వరంగల్‌లో డివిజన్లు పెరగడం లేదని చెప్పారట.

మేయర్‌ పీఠం ఆశించిన బీసీ నేతల ఆశలు ఆవిరి.!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే డివిజన్లు పెంచి. రిజర్వేషన్ల ప్రక్రియ పునః సమీక్ష సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకే పాత డివిజన్ల ప్రకారమే ఎన్నికలంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ లోకల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు. తమ వారి దగ్గర ఆరా తీస్తున్నారట. ఇప్పటికే కార్పొరేటర్లగా ఉన్నవారు తమకు టికెట్‌ వస్తుందో లేదోనని ఆందోళన చెందుతుంటే.. కొత్తగా టికెట్‌ ఆశిస్తున్నవారి ఆందోళన మరోలా ఉందట. ముఖ్యంగా మేయర్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్న బీసీ నేతల ఆశలు ఆవిరైనట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మేయర్‌ పీఠం జనరల్‌ కేటగిరిలో ఉండటంతో. ఆ పదవి ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయిందట. మంత్రి కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక్క టీఆర్‌ఎస్సే కాకుండా ఓరుగల్లులోని అన్ని పార్టీల్లోనూ ఆసక్తికర చర్చకు కారణమైంది.