సామాజిక మాధ్యమాల్లో యువతుల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి లైగింక వేధింపులకు పాల్పతున్న ఆకతాయి యువకుడిని బుధవారం వరంగల్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇంజనీరింగ్‌ చదువుతున్న ఆ యువకుడు ఇన్‌స్టాగ్రాంలోని యువతుల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసేవాడు. ఆ ఫొటోలతో నకీలీ ఇన్‌స్టాగ్రాం ఖాతాలు తేరిచేవాడు. మార్ఫింగ్‌ చేసిన ఫోటోలను తిరిగి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసి బ్లాక్ మెయిల్ చేసేవాడు.

తనతో అశ్లీలంగా చాట్ చేయాలని లేదంటే ఆ ఫొటోలను కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిస్తానని బెదిరించేవాడు. ఇలానే ఓ యువతి ఫొటోను మార్ఫింగ్ చేసి బాధితురాలి కాలేజీ గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో.. ఖంగుతిన్న ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వరంగల్‌ కమిషనరేట్‌ సైబర్‌ క్రైం పోలీసులు పలు కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.

యువతుల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని వరంగల్‌ రూరల్‌ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన యువకుడుగా గుర్తించారు. బుధవారం సైబర్‌ క్రైం, మట్వాడా పోలీసులు సదరు యువకుడిని అరెస్టు చేసి.. మార్ఫింగ్‌ కోసం వినియోగించే సెల్‌ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు.