నవజీవన్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో స్థానిక జీఆర్పీ పోలీసులు మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గర్భిణి భర్త జీతూ తెలిపిన వివరాల ప్రకారం: భార్య భావన, ఇద్దరు పిల్లలతో కలిసి జీతూ నవజీవన్‌ రైలులో విజయవాడ నుంచి రాజస్థాన్‌లోని జల్లోర్‌ పట్టణానికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో డోర్నకల్‌- మహబూబాబాద్‌ సెక్షన్‌ మధ్యలో భావనకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. భర్త జీతూ ఈ విషయాన్ని టికెట్‌ కలెక్టర్‌కు తెలియజేయడంతో ఆయన మహబూబాబాద్‌ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన జీఆర్పీ ఇన్‌ఛార్జి వెంకట్‌రెడ్డి, సిబ్బంది మోహన్‌తో కలిసి రైలు నిలపగానే సదరు గర్భిణిని ఆటోలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన అయిదు నిమిషాలకే సాధారణ ప్రసవం అయి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్‌ భారతి ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు…