సార్ ! బ్యాంకునుంచి మాట్లాడుతున్నా, మీ అకౌంట్‌ నంబర్ అప్‌డేట్‌ చేయాలి అంటూ ఓ అగంతకుడి నుంచి బ్యాంకు ఖాతాదారుడికి ఫోన్ వచ్చింది. నిజమేనని నమ్మి గూగుల్‌పే ద్వారా రూ.10 పంపాడు. ఇంకే ముంది చివరికి తన సెల్‌ఫోన్‌కు డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బ్యాంకు చుట్టూ, పోలీసుస్టేషన్ చుట్టూ బాధితుడు లబోదిబోమంటూ పరుగులు పెట్టాడు. ఈ ఘటన శుక్రవారం సుబేదారి పోలీసుస్టేషన్‌పరిధిలో జరిగింది .

సీఐ సదయ్య కథనం ప్రకారం: సుబేదారి పోలీసుస్టేషన్ పరిధిలోని ఎక్సైజ్‌కాలనీ ఇంద్రనగర్‌కు చెందిన వి. అజయ్ సెల్ నంబర్‌కు , గుర్తుతెలియని వ్యక్తి బ్యాంకు ఉద్యోగిని చెప్పి 8969154733 సెల్‌నంబర్ నుంచి ఫోన్‌చేశాడు. అ సమయంలో విజయ్ తల్లి ఫోన్ లిప్ట్ చేసింది అగంతకుడు హిందీలో మాట్లాడడంతో వెంటనే కుమారుడు విజయ్‌కి ఫోన్ ఇచ్చింది. అగంతకుడు విజయ్‌తో మాట్లాడుతూ మీ ఖాతా నుంచి రూ.10 నా సెల్ నంబర్‌కు పంపించండి, అకౌంట్ అప్ డేట్‌చేయాలి, మీ ఖాతానంబర్‌కు ఆధార్‌కార్డు సమస్య ఉంది, డబ్బులు పంపించండి అనడంతో విజయ్ నమ్మి తన వద్ద ఉన్న వేరే ఫోన్‌నంబర్‌తో గూగుల్‌పే ద్వారా డబ్బులు సెండ్ చేశాడు.

ఇది జరిగిన కొద్ది నిమిషాలకే హన్మకొండ నక్కలగుట్ట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోని విజయ్‌ఖాతా నుంచి రూ.లక్షా 69 వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. మరి కాసేపటికే డ్రాచేసిన ఈ డబ్బులో రూ.లక్షా 25 వేలు విజయ్‌ఖాతాలో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆందోళనకు గురైన బాధితుడు బ్యాంకుకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో అతడి ఖాతాలో రూ.44 వేలు గుర్తుతెలియని వ్యక్తి డ్రా చేసినట్లు నిర్ధారణ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.