వరంగల్ ఉమ్మడి జిల్లాలో కోవిడ్ – 19 కేసుల వేగానికి కల్లెం పడడం లేదు. జనగామ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది . ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. లాక్-డౌన్ నుంచి పది రోజుల క్రితం వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 91 కే పరిమితం కాగా, ఈ పది రోజుల్లో ఆ సంఖ్య 211 కి చేరడమే కాకుండా నలుగురు మృత్యువాత పడ్డారు . తాజాగా ఒకే రోజు 52 పాటిజివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలే కాకుండా, అధికారులు సైతం నివ్వరపోయారు. అలాగే , మంగళవారం కూడా 32 కేసులు నమోదయ్యాయని అధికారులు సాయంత్రం విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించారు.

ఇక వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న తొమ్మిది మంది పీజీ వైద్యులు , ఒక హౌస్ సర్జన్ కలిపి మొత్తం 10 మందికి పాజిటివ్ గా తేలడం గమనార్హం. విజృంభిస్తున్న మహమ్మారి జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది . ప్రతి రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం కూడా నాలుగు జిల్లాల్లో కేసులు నమోద య్యాయి. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది . ఇందులో ఇద్దరు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ వాసులే అయినా, ఇక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జూన్ ఆరంభం నుంచి విపరీతంగా పెరుగుతోంది.

ఈనెల 15 నుంచి 23 వ తేదీ వరకు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి . ఇప్పటివరకు గత మూడు నెలల్లో వచ్చిన మొత్తం కేసుల్లో 60 శాతం జూన్ లోనే ఉండడం ఆందోళనకర పరిణామం. జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవల ఓ ఫర్టిలైజర్ షాపు కాంటాక్ట్ కాకుండా 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా , ఒక మహిళ మృతి చెందారు . ఫర్టిలైజర్ దుకాణం లింక్ ద్వారా ఇప్పటి వరకు 61 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మంగళవారం 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటేన్ లో వెల్లడించారు. కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్యవిద్య అభ్యసిస్తూ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 9 మంది పీజీలు , ఒక్క హౌస్ సర్జనకు సైతం కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు..