{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1583203052612","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1583202943822","source":"other","origin":"unknown"}

అప్పు తీర్చాలన్న పాపానికి రుణదాతను తీవ్రంగా కొట్టారు. ఆయనతో వచ్చిన మిత్రుణ్ని ఇంటికి తీసుకెళ్లి చంపేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి ములుగు జిల్లా పస్రాలో జరిగింది. మృతుడు బొమ్మినేని సునీల్‌ రెడ్డి(35) వరంగల్‌లో ఓ దినపత్రిక రిపోర్టర్‌. వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ కోశాధికారిగా కూడా పనిచేస్తున్నారు. కర్ణాటకలోని హసన్‌కు చెందిన ప్రభు, దయానంద్‌లు పస్రాలో బేకరీ పెట్టాలనుకున్నారు. దీనికోసం హన్మకొండకు చెందిన దేవేందర్‌ రెడ్డి నుంచి అప్పు తీసుకున్నారు. అయితే వారు ఎంతకీ చెల్లించకపోవడంతో దేవేందర్‌ రెడ్డి తన మిత్రుడు సునీల్‌ రెడ్డితో కలిసి సోమవారం ఉదయం పస్రాకు వచ్చాడు. అప్పు చెల్లించాలని అడగటంతో దయానంద్‌, దేవేందర్‌ రెడ్డిల మధ్య మాటామాటా పెరిగింది.

ఈ క్రమంలో సునీల్‌ రెడ్డిని దయానంద్‌ తనవెంట ఇంటికి తీసుకెళ్లాడు. అదే సమయంలో బేకరీలో గలాట చెలరేగడంతో దయానంద్‌ భార్య తలుపులు వేసింది. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి దేవేందర్‌ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దయానంద్‌ ఇంట్లో అరుపులు విని స్థానికులు లోపలికి వెళ్లగా సునీల్‌ రెడ్డి కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. పోలీసులు దయానంద్‌, ఆయన భార్య, ప్రభు మిగతా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన దేవేందర్‌ రెడ్డి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

సునీల్ రెడ్డి హత్య దారుణం: జర్నలిస్ట్ సంఘాలు

వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, జర్నలిస్ట్ బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో సునీల్‌తో పాటు దేవేందర్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా దుండగులు నరికారు. మరోవైపు సునీల్ రెడ్డి దారుణ హత్యను జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. పథకం ప్రకారమే దుండగులు సునీల్ రెడ్డిని హత్య చేశారని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.