వరంగల్ వాసులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వరంగంల్, కాజీపేట, హన్మకొండలలోని ఇంటింటికీ ప్రతి రోజు తాగు నీటి సరఫరాల చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఉగాది నుంచి ఇంటింటికి తాగు నీటిని అందివ్వనుంది. కాగా, హన్మకొండ, వరంగల్‌లోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. గత 15 రోజులుగా ఈ తీవ్రత మరి ఎక్కువగా ఉంది. వరంగల్ బ్యాంక్ కాలనీలో పలువురు మహిళలు నీటి కష్టాలపై నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సరిపడ నీటి సరఫరా చేయడం లేదని ఆ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. నీళ్లు సరిపడ రానప్పుడు నల్ల కనెక్షన్ ఉండటం వల్ల లాభమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. అయితే ప్రస్తుతం వరంగల్‌లో పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని. ఈ కారణంగానే నగరంలో కొన్ని ప్రాంతాలకు రెండు మూడు రోజల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని GWMC అధికారి ఒకరు తెలిపారు.

ఇందుకు సంబంధించి వార్త పత్రికల ద్వారా సమాచారం జారీ చేసినట్టు చెప్పారు. ఉగాది నుంచి ఈ సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. ఇక, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉగాది నుంచి ఇంటింటీకీ ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగత్మాకంగా ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గతేడాది డిసెంబర్‌లో చెప్పిన సంగతి తెలిసిందే. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన కేటీఆర్, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ నగర పరిధిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు ప్రజలకి అందించే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.