వ్యక్తి వ్యాపారం చేసేందుకు అప్పులు చేశాడు. కాలం కలిసిరాక నష్టాలొచ్చి ఆర్థికంగా చితికిపోయాడు. ఫలితంగా తాగుడుకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. భర్త వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తాను మారతానంటూ నమ్మించి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అయినా మారకుండా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ దిగాడు. క్రమంలోనే భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. తల్లిని చంపడాన్ని చూసిందని అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల కూతురి ప్రాణం సైతం తీశాడు. హృదయవిదారక ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే:

వరంగల్ నగరం బీఆర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు, రమ్య(29) దంపతులు. వెంకటేశ్వర్లు ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తనకు వచ్చే జీతం డబ్బులు సరిపోకపోవడంతో వ్యాపారం చేయాలని భావించాడు. అందులో భాగంగానే అప్పు చేసి వ్యాపారం పెట్టాడు. అదికాస్త కలిసి రాకపోవడంతో నష్టాలు వచ్చి ఆర్థికంగా చితికిపోయాడు. ఫలితంగా తాగుడుకు బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవపడుతుండడంతో వేధింపులు తాళలేక రమ్య కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే వెంకటేశ్వర్లు తన ప్రవర్తన మార్చుకుంటానంటూ నమ్మించి రమ్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.
ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు రమ్యతో గొడవకు దిగాడు.

ఈ క్రమంలోనే రమ్యను మద్యం మత్తులో గొంతు నులిమి చంపేశాడు. అయితే తల్లిని చంపాడాన్ని చూసిందన్న కారణంతో కూతురు మనస్విని(8)ని సైతం గొంతు నులిమి హత్య చేశాడు. రోజూ ఉదయాన్నే కన్పించే రమ్య.. మధ్యాహ్నాం అయినా ఇంటిలో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు ఇంటిలోకి వెళ్లి చూశారు. తల్లీకూతుళ్లు అచేతనంగా పడి ఉండడంతో స్థానికులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే తల్లీకూతుల్లిద్దరూ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.