వరంగల్ అర్బన్ : లాక్ డౌన్ సడలింపులతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు పునః ప్రారంభమయ్యాయి.  రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వేయిస్తంభాల గుడిలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయాల ప్రవేశం సందర్భంగా భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ ఆలయ సిబ్బంది లోపలికి అనుమతి ఇస్తున్నారు. అలాగే భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు ఇలా నిబంధనలు పాటిస్తూ దైవ దర్శనం చేసుకుంటున్నారు…

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి:

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాలు రుద్రేశ్వరాలయం, కాళేశ్వర ముక్తేశ్వరాలయం, రామప్ప, సిద్ధేశ్వరాలయం, కురవి వీరభద్రస్వామి, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో ఈరోజు ఉదయం నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో భౌతిక దూరం పాటించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాస్కులు ఉన్న వారికే గుళ్లోకి అనుమతి ఇవ్వనున్నారు.