వరంగల్ జిల్లా, హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మహా ఉద్వేగానికి లోనవుతాం. సోపానాల (మెట్లు) దగ్గరి నుండి గోడల వరకూ దేన్ని చూసినా ప్రాణం లేచి వస్తుంది. కుడ్యాలమీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్యలోకంలో అడుగుపెట్టిన భావన కలిగిస్తాయి.ఇది చాలా పురాతనమైన చారిత్రక ఆలయం. దీన్ని 12 వ శతాబ్దంలో కాకతీయ రాజు #రుద్రమదేవుడు నిర్మించాడు. #కాకతీయులు , అనంతర రాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకుని సేద తీరేవారని చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

పేరులోనే స్పష్టమౌతున్నట్లు ఇది వేయి స్తంభాలతో నిర్మితమైన దేవాలయం. అయితే, వేయి స్తంభాలను గణించడం కష్టమైన పనే. కొన్ని విడిగా, ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి. ఆలయ వేదిక వద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి. ఈ గుడి వేయి స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు. ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్థంబాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్తస్వరాలు, లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది.

  • వేయి స్తంభాల దేవాలయం మీటరు ఎత్తయిన అధిష్టానంపై ఉంది. త్రికూటాలయాలు పాతిక మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఎక్కడ చూసినా అందాలోలికే శిల్పాలు కొలువై ఉంటాయి. దక్షిణాన ఎత్తయిన ద్వారశాల, వేయి స్తంభాల మండపంలో ఎత్తయిన పీఠంమీద నందీశ్వరుడు కాకతీయుల శిల్ప కళకు ప్రతీకలుగా నిలిచాయి.
  • వేయిస్తంభాలగుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు. ఎత్తయిన వేదికమీద మధ్యలో నృత్య గాన మందిరం ఉంది. పూర్వం ఈ నృత్య మందిరం గాయనీగాయకుల పాటలతో, నర్తకీమణుల నృత్యాలతో అలరారేదని చెప్పే ఆధారాలు ఉన్నాయి.
  • వేయి స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీ.శ. 1163లో కాకతీయ రాజు ఒకటవ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది. చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది.

ఆలయ విశేషాలు:

వరంగల్ నుండి సుమారు 5 కి.మీ.దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.

ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడినికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వార పాలకులుగా ఉన్నట్లుగా నిలచిన గజ శిల్పాలను దాటి సభామంటపంలోనికి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరున్ని అర్చించి భక్తులు రుద్రేశ్వరున్ని దర్శిస్తారు.

ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం, ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పుణాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది.
ఆలయ ప్రాంగణంలో మరేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాలకొరకై ఓరుగల్లు కోట, ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా, రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయడం జరిగింది. 2014లో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కల్యాణ మంటపం క్రింద ఒక బావి వెలువడింది.

మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరున్ని దర్షిస్తారు. మహాన్యాస పుర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యపూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే #రుద్రేశ్వరస్వామి ని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందనడం నిస్సంశయం.

  • వేయి స్తంభాల గుడి, ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికీ చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఈ త్రికూటాత్మక ఆలయంలో సూర్యభగవానుడి విగ్రహం ప్రస్తుతం లేదు. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను, అపురూపమైన శిల్ప సంపదను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంమీద, మనమీద కూడా ఉంది.