{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1583990238176","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1583990138229","source":"other","origin":"unknown"}

గీసుకొండ మండలం కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర వైభవంగా జరుగుతోంది. ఈ నెల 9న హోలీ సందర్భంగా జాతర ప్రారంభమైంది. మూడో రోజైన బుధవారం ఆలయంలో నిత్యనిధి, మొక్కుబడులు, సేవలు, అర్చనలు జరిగాయి. దైవ దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యూలైన్‌ కిటకిటలాడింది.

భక్తులు ఏనుగు, ఒంటె, హంస తదితర ఆకృతులతో కూడిన బొమ్మలను ఎడ్లబండ్లపై ఏర్పాటు చేసుకుని జాతరకు తరలివచ్చి దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచారి, పూజారి కాండూరి రామాచారీ పూజలు నిర్వహించారు. స్థానిక ఎంపీపీ బీమగాని సౌజన్య, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఉత్సవ కమిటీ ప్రతినిధి గడ్డమీది కుమారస్వామి జాతరను పర్యవేక్షించారు. వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన శిబిరాన్ని డీఎంహెచ్‌వో మధుసూదన్‌ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

జాతరలో యువతి కిడ్నాప్:

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల జాతరలో ఓ యువతి కిడ్నాప్‌కు గురికాగా ఆమె తండ్రి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు: వరంగల్‌ అర్బన్‌ జిల్లా లేబర్‌కాలనీకి చెందిన యువతి కుటుంబం కొమ్మాల జాతరకు వెళ్లి మంగళవారం అక్కడే విడిది చేశారు. జాతరలో బయటకు వెళ్లిన యువతిని తనతో చదువుకుంటున్న గరీబ్‌నగర్‌కు చెందిన ఓర్సు ప్రభాకర్‌ బలవంతంగా లాక్కెళ్తుండగా ఆమె సోదరి చూసి కేకలు వేసింది. తల్లిదండ్రులు వెళ్లేసరికి వారు పారిపోయారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరామయ్య తెలిపారు.