ఓరుగల్లుకు చెందిన శారద, అందరిలానే సగటు అమ్మాయి. పేదరికం వల్ల ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని పెంచి పెద్దచేశారు. ఉన్నంతలో తల్లిదండ్రులు మంచిగానే చదివించారు. అందుకు తగిన విధంగా ఆ అమ్మాయి కష్టపడి చదివి దేశ రాజధాని ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం సాధించింది. ఇక అమ్మానాన్నలకు ఆసరాగా నిలబడతాననుకుంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఉన్న ఉద్యోగం కోల్పోయింది. మళ్లీ ఎప్పటిలానే పరిస్థితి ఏర్పడింది. మంచిగ ఫ్యాన్‌ కింద కూర్చోని చేసే ఉద్యోగం పోయింది. ఏలా బతకాలనో బెంగ పెట్టుకోలేదామె. ఏది జరిగినా మన మంచి కోసమేనంటూ ధైర్యం కూడగట్టుకుంది. చిన్నప్పటి నుంచి పేదరికం కారణంగా ఎప్పుడు ఒడిదుడుకుల ముందు అవేమీ పెద్దగా అన్పించలేదు. తన స్వశక్తితో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు నడుం బిగించింది.

తానో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినన్న అహం ఏదీ ఆమెకు అడ్డురాలేదు. నిక్షేపంగా రోడ్డు పక్కన కూరగాయలు పెట్టి అమ్ముతూ జీవనం సాగిస్తోంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను తీసుకుంటున్న ఇప్పటి యువతకు తానే ఆదర్శప్రాయురాలిగా నిలుస్తోంది. ఏం పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు. చేసే పనిలో నిబద్ధత అనేది ముఖ్యమంటోదీ ఈ మాజీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శారద. దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా శారద పనిచేసింది.
ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంలో చేరింది. మంచి వేతనం, అమ్మనాన్నలకు సమీపంలోనే ఉద్యోగం.

సంతోషంగా జాబ్‌లో జాయిన్ అయ్యింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా కంపెనీ శారదను ఉద్యోగం నుంచి తొలగించింది. దీనికి శారద ఏలాంటి మానసిక కుంగుబాటుకు గురికాకుండా ధైర్యంగా నిలబడింది. ఉద్యోగం లేకపోతేనేం చేసేందుకు పని లేదా అంటూ సర్ది చెప్పుకుంది. తానో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనే అహం పక్కనపెట్టేసి తల్లిదండ్రులతో కలిసి కూరగాయల వ్యాపారం చేస్తోంది. ప్రస్తుతం కూరగాయలు అమ్ముతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, శభాష్.! శారద..! అంటూ ప్రశంసిస్తున్నారు.