వరంగల్​ రూరల్​ జిల్లా పరకాలకు చెందిన కొత్తకొండ రాజన్న, సత్యలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం జనగామకు వచ్చి బాలాజీనగర్​లో అద్దెకు ఉంటున్నారు. బచ్చన్నపేట మండలం కొడవటూరు పుణ్య క్షేత్రం వద్ద రాజన్న కొబ్బరికాయలు అమ్ముతుంటాడు. కూతురు పెళ్లయింది. కొడుకు సంతోష్​ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

సోమవారం రాజన్న(58) గుండెపోటుతో కొడవటూరులో చనిపోయాడు. కొడుకు సంతోష్​అంబులెన్స్​లో తండ్రి మృతదేహాన్ని జనగామకు తీసుకొస్తున్నట్లు ఇంటి ఓనర్ కు చెప్పాడు. ఓనర్​మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని అన్నాడు. జనగామ గ్రేన్​మార్కెట్​ఏరియాలో నివాసం ఉంటున్న రాజన్న అత్తగారిని అడగగా మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచేందుకు వారూ అంగీకరించలేదు.

దీంతో నెహ్రూ పార్క్​ సమీపంలోని శ్మశానవాటికకు మృతదేహంతో రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. ఓ బెంచీపై మృత దేహాన్ని ఉంచి తల్లి, నలుగురు మిత్రులతో కలిసి రాత్రంతా జాగారం చేశారు. మంగళవారం అంత్యక్రియలు పూర్తి చేశారు.