నగరానికి చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మశిల్పి మట్టెవాడ అజయ్‌కుమార్‌ కోవిడ్‌-19 నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ సూది రంధ్రంలో అయిదు సూక్ష్మ శిల్పాలను ప్రత్యేకమైనంతో చెక్కి వాటికి రంగులు వేశాడు. కరోనా వైరస్‌ మాస్క్‌ పెట్టుకొని రెండు చేతులు జోడించి డాక్టర్స్‌, నర్స్‌, పోలీసు, పారిశుధ్య కార్మికులకు మొక్కుతున్నట్టు ఈ శిల్పాలను చెక్కాడు.

కరోనా వైర్‌సకు మాస్క్‌, డాక్టర్‌కు పీపీఈ దుస్తులు, మెడలో స్టెతస్కోప్‌, చేతికి గ్లౌజులు, నర్సుకు మాస్క్‌, చేతిలో ఫైల్‌, యూనిఫామ్‌లో ఉన్న పోలీసు, చేతిలో లాఠీ, డ్రెస్‌కు మెడల్స్‌, పారిశుధ్య కార్మికుడికి మాస్క్‌, చేతిలో చీపురు పట్టుకున్నట్లుగా ఈ శిల్పాలను చెక్కారు. మైక్రోస్కోప్‌ ద్వారా చూస్తే చాలా స్పష్టంగా కనిపించేలా వీటిని రూపొందించారు. ఈ శిల్పాల సైజులు 1.20ఎంఎం నుంచి 0.90 ఎంఎం వరకు ఎత్తు, 0.36 ఎంఎం నుంచి 0.15ఎంఎం వరకు వెడల్పు ఉన్నాయి. వీటిని 22రోజుల్లో రూపొందించారు.