స్మార్ట్‌ సిటీ కింద వరంగల్‌కు కేంద్రం విడుదల చేసిన నిధులను మళ్లించలేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ తెలిపారు. వరంగల్‌ స్మార్ట్‌సిటీకి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.196 కోట్లను కూడా విడుదల చేసిందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులకు సంబంధించిన బీఆర్వో వివరాలను ఆయన వెల్లడించారు. 2015లో స్మార్ట్‌సిటీ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం 2016లో వరంగల్‌ నగరాన్ని ఆ జాబితాలో చేర్చిందని గుర్తుచేశారు. ఆ సమయంలో కేంద్రం విడుదల చేసిన రూ.196.40 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వరంగల్‌ నగరానికి బదిలీ చేసిందని పేర్కొన్నా రు.

వీటికితోడు రాష్ట్రం తనవంతుగా నిధులను విడుదల చేస్తూ వస్తున్నదని తెలిపారు. స్మార్ట్‌సిటీకి సంబంధించి రూ.1,029 కోట్ల విలువైన 63 పనులను వరంగల్‌లో చేపట్టామని, ఇప్పటివరకు రూ.46.67 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. రూ.40.67 కోట్ల బిల్లులు చెల్లించినట్టు వివరించారు. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ వద్ద 2021 మే వరకు పూర్తయ్యే పనులకు అవసరమైన నిధుల కంటే ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన పనులు పూర్తయ్యే నాటికి రాష్ట్రప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భూ సేకరణ ఇతర కారణాల వల్ల పనుల్లో కొంత జాప్యం అయిందని తెలిపారు. సీఎం హామీల అమలుకు రూ.109.29 కోట్లను, పట్టణ ప్రగతి కింద రూ.72.87కోట్లను విడుదల చేశామని చెప్పారు.