రేపిస్టులను ఏం చెయ్యాలి? అనే ప్రశ్నకు ఇప్పుడు అందరూ ఉరి శిక్ష వెయ్యాలనే అంటున్నారు. కానీ ! ఢిల్లీ నిర్భయ ఘటనతో ప్రత్యేకంగా నిర్భయ చట్టాన్నే తెచ్చినా ! ఆ కేసులో దోషులకు ఇప్పటివరకూ ఉరిశిక్ష పడలేదు. మన న్యాయవ్యవస్థలో లోపాలు, కాలయాపన వంటివి రేపిస్టులకు వరంగా మారుతున్నాయి. నిర్భయ ఘటన తర్వాత మన దేశంలో కొన్ని వేల అత్యాచారాలు జరిగాయి. వాటిలో వెలుగులోకి రానివి ఎన్నో.

అంతెందుకు! తాజాగా షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో కేటుగాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలని అందరూ కోరుతుంటే కూడా! అత్యాచారాలు ఆగట్లేదు. వరంగల్‌లో జరిగిన దారుణమే అందుకు ఉదాహరణ. హన్మకొండలోని ఓ హాస్టల్‌లో చదువుకుంటోంది 14 ఏళ్ల గిరిజన మైనర్ బాలిక. ఈ మధ్య ఆమె కళ్లలో ఉత్తినే నీరు కారుతుంటే ఎందుకు అలా అవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే డాక్టర్‌కి చూపించుకోమని తోటి అమ్మాయిలు సలహా ఇచ్చారు.

సరే అనుకున్న బాలిక అక్కడి RMP దగ్గరకు వెళ్లింది. తన సమస్య చెప్పింది. ఆ సమయంలో బాలిక ఒక్కత్తే తన దగ్గర ఉండటంతో ఆ దుర్మార్గుడి కళ్లు బాలికపై పడ్డాయి. ట్రీట్‌మెంట్ చేస్తున్నానంటూ ఇంజెక్షన్ ఇచ్చాడు. అది మత్తు ఇంజెక్షన్ కావడంతో బాలిక మత్తులోకి వెళ్లిపోయింది. ఆమెను రేప్ చేశాడు. మత్తు వదిలిన తర్వాత బాలిక నిద్ర లేచింది. ఏడుస్తూ హాస్టల్‌కి వెళ్లింది. ములుగులోని తన తల్లికి కాల్ చేసి విషయం చెప్పి బోరున ఏడ్చింది. కూతుర్ని ఓదార్చిన తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బాలిక ద్వారా కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు, నిందితుడి కోసం వెతుకుతున్నారు…