తన భర్త కనిపించడంలేదని ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ బాధిత మహిళ జనగామ పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మూడు గంటలపాటు ధర్నా నిర్వహించింది. రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన కొలెపాక అనీల్‌, వరంగల్‌కు చెందిన కొలెపాక చైతన్య ప్రేమ వివాహం చేసుకొని ఐదేళ్లుగా జనగామలో ఉంటున్నారు. ఈ క్రమంలో అనీల్‌ మరో యువతిని తీసుకుని వెళ్లిపోయినట్లు అతని భార్య చైతన్య చెబుతోంది.

తాను నెల రోజుల క్రితం జనగామ ఠాణాలో ఫిర్యాదు చేసినా పోలీసులు తన భర్త జాడ కనిపెట్టడంలేదని ఆరోపిస్తూ బాధిత మహిళ చైతన్యతోపాటు ఆమె కుటుంబ సభ్యులు జనగామ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. జోక్యం చేసుకున్న పట్టణ ఎస్సై శ్రీనివాస్‌ వారితో మాట్లాడుతూ: చైతన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్వరలో ఆమె భర్తను అప్పగిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

ఇదిలా ఉండగా పోలీసులు సాయంత్రం 6.30 గంటలకు అనీల్‌ను పట్టుకున్నారు. ఈ విషయమై పట్టణ సీఐ మల్లేష్‌ మాట్లాడుతూ: చైతన్య ఫిర్యాదు ఇచ్చిన నాటి నుంచే విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. తాను మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు చెప్పాడని తెలిపారు. తన భార్య చైతన్యతో గొడవలు రావడంతోనే తాను ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. అనీల్‌ను ఆయన భార్య చైతన్యకు అప్పగించినట్లు సీఐ వివరించారు.