అతడో ఆర్మీ జవాను, డిఫెన్సులో పని చేసే వారంతా బాధ్యతగా ఉంటారనే భావనకు భిన్నంగా ఉంటుందీ యువకుడి వ్యవహారం. అతడి వ్యవహారశైలి ఇప్పుడు వివాదంగా మారటమే కాదు, అతగాడికి చిక్కులు తప్పేటట్లు లేవు. ఆరేళ్లుగా ప్రేమించుకొని శారీరంగా వాడుకొన్న తర్వాత పెళ్లి అంటే అతగాడి నోటి నుంచి వచ్చిన మాటలకు షాక్ తిందా యువతి. తనను ప్రేమించిన వ్యక్తి, తాజాగా బెదిరిస్తున్న వైనంపై నిప్పులు చెరుగుతోంది బాధితురాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో చోటు చేసుకున్న మౌనపోరాటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

టేకుమట్ల: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని ఎన్‌కౌంటర్‌ చేస్తానని బెదిరించాడో ప్రేమికుడు. దీంతో యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. టేకుమట్లకు చెందిన కొలుగూరి కార్తీక్‌ ఆర్మీ జవాన్‌. రేగొండ మండలం జగ్గయ్యపేటకు చెందిన తమ బంధువైన ఓ యువతిని ఆరేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ యువతి పెళ్లి చేసుకోమని అడగగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఫోన్‌లో సంప్రదిస్తే ‘నేను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టును, ఎన్‌కౌంటర్‌ చేస్తా. నీకు దిక్కున్న చోట చెప్పుకో. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు.’అని బెదిరిస్తున్నాడని యువతి వాపోయింది. కార్తీక్‌తో పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. చివరకు కుటుంబ సభ్యులతో కలసి శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కార్తీక్‌ ఇంటి ఎదుట మౌన దీక్ష చేపట్టింది.