{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584026892377","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584026134678","source":"other","origin":"unknown"}

వరంగల్‌ లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్‌)కి చెందిన పరిశోధన విద్యార్థి కరోనా లక్షణాలతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. గత కొంత కాలంగా విద్యార్థి తీవ్ర జ్వరంతో బాధపడుతూ హన్మకొండలోని ఓ రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో విద్యార్థిని పరీక్షించిన అక్కడి వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలోని కరోనా ప్రత్యేక వార్డులో ప్రస్తుతం విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే వెంటనే విద్యార్థిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తామని ఎంజీఎం వైద్యులు తెలిపారు.

విద్యార్థికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిట్ క్యాంపస్‌లో వార్తలు వ్యాప్తి చెందడంతో నిట్‌ రిజిస్ట్రార్‌ స్పందించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అమెరికాలో జరిగిన ఓ అంతర్జాతీయ సెమినార్ పాల్గొన్న విద్యార్థి మార్చి 1న తన సొంత జిల్లా కర్నూల్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి మార్చి 8వ తేదీన హన్మకొండ వచ్చాడు. అప్పటికే విద్యార్థి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండడంతో మార్చి 10న స్థానిక రోహిణి ఆస్పత్రిలో చేరాడు. అతని పరిస్థితిని గమనించిన అక్కడి వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఇవాళ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు’ అని నిట్‌ రిజిస్ట్రార్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

తాజాగా పరిశోధన విద్యార్థికి కరోనా లక్షణాలు ఉన్నాయనే వార్తతో నిట్‌ క్యాంపస్‌లో కాస్త ఆందోళనకర వాతావరణం నెలకొంది. సుమారు 40 దేశాలకు చెందిన విద్యార్థులు నిట్‌లో చదువుతున్నారు. నిత్యం ఇతర దేశాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు నిట్‌కు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో నిట్‌ యాజమాన్యం అప్రమత్తమైంది…